ఆంధ్ర శబరిమల – ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం

హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం

అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప …

అంటూ అయ్యప్ప స్వామి శరణు ఘోష తో అలరారుతూ ఉంటుంది మన దక్షిణ భారత దేశం .

ప్రకృతి రమణీయత, కోనసీమ అందాల మధ్య వెలసిన ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా లోని ద్వారపూడి, ఆంధ్రా శబరిమలై గా పేరు గాంచింది. ద్వారపూడి లో , శైవ వైష్ణవ సంగమ స్వరూపం అయిన, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, శబరి మల లోని ఆలయానికి ఏమాత్రం తీసిపోకుండా నిర్మించడంతో అంతటి ప్రాచుర్యాన్ని పొందింది.

1983లో కనక రాజు గురు స్వామి గారు, వారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన చేసారు.1989 లో ఈ ఆలయంలో కంచి కామ కోటి పిఠాధి పతి శ్రీ.శ్రీ.శ్రీ. జయేంద్ర సరస్వతి స్వామి వారు విగ్రహ ప్రతిష్ట చేసారు. పడి పూజకు సంభందించి ఏక శిల పై18 మెట్లు చెక్కించి, బంగారం తో తాపడం చేయించారు. అయ్యప్ప దీక్ష ను చేపట్టిన వారిలో శబరిమలై వెళ్ళలేని భక్తులు ఇక్కడి దేవాలయాన్ని దర్శించుకుని , ఇరుముడులు సమర్పించి దీక్ష ను విరమింప చేయడం జరుగుతుంది . ఈ ఆలయానికి ఉన్న విశేష ఆదరణ వలన కోస్తా జిల్లాల లోని భక్తులు విరివి గా వస్తారు. స్వామిని దర్శించు కుంటారు.

శబరిమలలో స్వామి వారికి పూజాదికాలు నిర్వహించే రీతి లోనే ఇక్కడ కూడా నిర్వహిస్తారు. ఉదయం 4″ గంటలకు మహా గణపతి హోమం, 5″ గంటలకు ప్రేత్యేక పూజ/ ఉత్సవ పూజ, తరువాత విశేష అభిషేకాలు, ఇరుముడి అభిషేకాలు నిర్వహిస్తారు. అయ్యప్ప స్వామికి ప్రీతి పాత్రమైన బుధవారం నాడు నెయ్యి అభిషేకం, మరో 18 రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ తులా భారం కార్యక్రమాలు కూడ జరుగుతాయి.

ఆలయానికి తూర్పు వైపున సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయం తో అష్టా దశ ఉమాలింగేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించారు. మూడవ అంతస్తు లో అభిషేకం చేస్తే ఆ జలము ఈ లింగాల మీద పడేలా రూపకల్పన చేసారు. భుగార్భాన 200 అడుగుల పొడవున సొరంగం తవ్వి , అక్కడ నుంచి మరో 40 అడుగుల లోతున భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం నిర్మించారు. దేశము లో వివిధ రాష్ట్రములలో జ్యోతిర్లింగ దేవాలయాలు ఉన్న ప్రదేశముల నుంచి శివ లింగాలను సేకరించి ప్రతిష్టించారు. ఆలయం లో జ్యోతిర్లింగాల దర్శనానికి పురుషులు తెల్లని పంచ మాత్రమే ధరించి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి నూనె, పాలు ఇస్తారు. అక్కడ వెలుగుతున్న దీపపు ప్రమిదలలో నూనె వేసుకుంటూ వెళ్లి, పాలతో శివ లింగాలకు అభిషేకం చెయ్యాలి.

ఆలయ ముఖద్వారము వద్ద 32 అడుగుల శివకేశవ విగ్రహము భక్తులను విశేషముగా ఆకట్టుకుంటుంది. ఆలయ ఆవరణలో పంచ ముఖ ఆంజనేయ స్వామి ,కనక దుర్గ అమ్మ, షిరిడి సాయి బాబా , అనంత పద్మ నాభ స్వామి, అనంత కామధేనువు అమ్మవారి ఆలయం, నవ గ్రహా లయం, 27నక్షత్రాల ఆలయం, పాప విమోచనాలయమ్ లో నాగదేవతా విగ్రహాలు వున్నాయి.

ఇన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించ వలసిందే. భక్తుల పాలిటి పెన్నిధి గా విరాజిల్లుతున్న ఆంధ్రా శబరిమలైను దర్శించుకుని పునీతులవుదాము.

స్వామియే శరణం అయ్యప్ప!!!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved