ఆరోగ్యాన్ని పెంపొందించే సబ్జగింజలు!

వీటి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే మనకు తెలిసిన విత్తనాలన్నింటిలోనూ భలే వింతగా ప్రవర్తించేవి ఇవే కాబట్టి..! చాలామందికి ఇవి బాగా గుర్తుండిపోయి ఉంటాయి. నీటిలో వేయగానే ఉబ్బి, జెల్‌లా తయారవుతాయి సబ్జ గింజలు. వీటిని ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీటిని తాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయట.. మహిళలకు తప్పకుండా కావాల్సిన ఫోలేట్‌తో పాటు అందాన్ని ఇనుమడింపచేసే విటమిన్ 'ఇ' కూడా ఇందులో లభిస్తుంది.. మరి ఇంకా ఎలాంటి ఖనిజాలు వీటిలో దాగున్నాయో ఒకసారి చూద్దాం..!

* ఈ విత్తనాలకు కాస్త తడి తగిలినా అవి ఉబ్బిపోతాయి. దీంతో వాటి బరువు పదింతలు పెరిగిపోతుంది.. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపునిండిన భావన కలిగి మాటిమాటికీ ఆకలేయదు.

* జిగురులా ఉండే ఈ సబ్జ గింజల్లో ఔషధగుణాలు బోలెడు ఉంటాయి, పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి.

* కేవలం శరీరం లోపలి భాగాన్నే కాక బయట భాగాన్ని కూడా కాపాడటంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెతో కలిపి గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు, దీని వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

* తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత తాగి చూడండి, సమస్య తగ్గిపోవడమే కాదు.. మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతమవుతుంది.

* రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తరువాతే ఏదైనా..!

* శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె, నానబెట్టిన సబ్జ గింజలు, ఈ మూడు వేసి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస కూడా బాగా ఆడుతుంది.

* క్రీడాకారులకు ఈ గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి..

* గొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలు పీడిస్తున్నాయా..? ఇలాంటప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేయండి. ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి.

* బీపీ మాటిమాటికీ పెరుగుతోందా..? అయితే వీటిని కచ్చితంగా తీసుకోవాల్సిందే.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల బీపీ నెమ్మదిగా అదుపులోకి వస్తుంది..

* వీటిలో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమెగా-3 ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

* బ్యాక్టీరియా సంబంధిత సమస్యలని నివారించే మంచి యాంటీబయోటిక్‌లా కూడా పనిచేస్తాయి ఈ గింజలు.

* కేవలం నీటితోనే కాక మజ్జిగ, కొబ్బరినీళ్లతో పాటు ఇతర పండ్ల రసాలతో కూడా ఈ గింజల్ని కలిపి తీసుకోవచ్చు.

* ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసుకుని తాగితే మంచి ఫలితముంటుంది.

* ఇవి చర్మ సమస్యల్ని అరికట్టడంలోనూ బాగా సహకరిస్తాయి.

* చూశారుగా, సబ్జగింజల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో. అవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారుగా.. వేసవిలో చలువ చేసే ఈ గింజలను ప్రతిరోజూ తీసుకోవడం మర్చిపోకండి మరి..!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved