నేను, నా స్నేహితులతో కలిసి నెల్లూరులో ఇంటర్ చదువుతున్న రోజుల్లో, మేము ఉంటున్న రూముకు ఎదురుగా ఒక పేద ఆటో డ్రైవర్ ఫ్యామిలీ ఉండేది. ఆ ఆటో డ్రైవర్ భార్య గర్భవతిగా ఉన్న ఆ సమయంలో, వారు ఆర్ధికంగా ,ఆరోగ్య పరంగా చాలా బాధలు పడేవారు. నెలలు నిండిన ఆమెకు, పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రిలో చేర్పించాడు ఆ ఆటో డ్రైవర్.అక్కడి వైద్యులు ఆమెకు అర్జెంటుగా రక్తాన్ని ఎక్కించవలసిన అవసరం ఉందనీ, లేకుంటే తల్లీ బిడ్డల ప్రాణాలకు ముప్పు అనీ చెప్పారు. ఆసుపత్రిలో మందుల ఖర్చులకు, రక్తానికి అవసరమయ్యే డబ్బులు లేకపోవటంతో, అతను ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి అందరినీ డబ్బులు అడిగాడు.కానీ ఎవరూ కనికరించలేదు. లంచ్ బ్రేక్ లో రూమ్ కు వస్తున్న మాకు ఈ విషయం కంట పడింది.నేను, నా స్నేహితులతో కలిసి ఆ ఆటో డ్రైవర్ కు మా వద్ద ఉన్న పాకెట్ మనీ ని ఇచ్చాము. దానిని తీసుకుని అతను బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి , అక్కడి నుండి ఆసుపత్రికి వెళ్ళేసరికి, ఆ తల్లీ బిడ్డలు ఇద్దరూ మరణించారు. కనీస మానవత్వమైనా చూపని అతని ఇంటి చుట్టు ప్రక్కల వాళ్ళు, సమయానికి అందని రక్తంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. చనిపోయిన వారిని చూస్తూ, ఆ ఆటో డ్రైవర్ గుండెలవిసేలా రోదించడం కంట తడి పెట్టించింది.చాలా రోజుల వరకు నన్ను చాలా భాదించింది. ఈ హృదయ విదారక సంఘటన నా మనసులో బలంగా నాటుకు పోయింది.ఎలాగైనా భవిష్యత్తులో పేదలకు సేవ చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. దానికి కార్యరూపం ఇచ్చేందుకు గాను , నా చదువు పూర్తయిన వెంటనే, 2009 వ సంవత్సరం జూన్ 11 వ తేదీన “ స్నేహహస్తం డెవలప్ మెంట్ సొసైటీ” ని స్థాపించి , నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను. - గోపిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved