ఉపవాసం.. ఉపయోగం... నమశ్శివాయ!

ఏడాదికి ఒక్కరోజైనా శరీర అంతర్గత అవయవాలకు విశ్రాంతినివ్వడం వల్ల వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ఈ రోజు శివరాత్రి. శివభక్తులు ఉపవాసన, జాగరణ చేస్తుంటారు. వారి దీక్ష మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉండాలంటే...

పండ్లు - పాలు

చాలా మంది ఈ రోజు పండ్లు, పాలతో సరిపెట్టేస్తారు. ఇది చాలా మంచిది. పాలు సమతుల ఆహారం. పండ్లు పోషకాలను ఇవ్వడమే కాకుండా ఆకలి కానివ్వకుండా సాయపడతాయి. రోజులో కనీసం ఆరు సార్లు పండ్లు, పాలతో సరిపెట్టడం వల్ల శరీరంలోని విషపూరితాలు బయటకు వెళ్లిపోతాయి. సాధారణంగా ఈ పద్ధతి ప్రతి రోజూ జరుగుతుంది. ఈ పనంతా కాలేయం చేస్తుంది. రోజంతా పండ్లు, పాలు తీసుకోవడం వల్ల కాలేయానికి విశ్రాంతి లభించి, దాంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

పండ్లలో ఉండే ఖనిజాలు, విటమిన్లు అందడం వల్ల పోషకాహార లోపం వంటివి ఉంటే ఈ రోజుతో భర్తీ అవుతాయి. పీచు పదార్థం వల్ల జీర్ణవ్యవస్థ అంతా శుభ్రపడుతుంది.

ఈ కాలం ప్రకృతి నుంచి పండ్లు బాగా అందుతాయి. వచ్చే ఎండాకాలానికి సిద్ధపడటానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది. రోజంతా తగినన్ని పండ్లు, పాలు తీసుకున్నవారు కేజీ నుంచి 2 కేజీల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

ఇలా సరైనది కాదు...

రోజంతా ఏమీ తినకుండా కేవలం టీ, కాఫీలతో సరిపెట్టేయడం మంచిది కాదు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆకలి పుడుతున్నప్పుడు ఆహారం అందివ్వకపోతే పొట్టలో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో అల్సర్ పెరిగి, మంట పుడుతుంది. తరచూ ఉపవాసాలు చేసేవారు ఇదే పద్ధతిని అనుసరిస్తే జీర్ణవ్యవస్థపై చెడుప్రభావం చూపి, అనారోగ్యం కలుగుతుంది.

ఉపవాసం వల్ల నిన్నంతా ఏమీ తినలేదు కదా అని ఉపవాస దీక్ష వదిలే రోజు ఉదయాన్నే కావల్సినదానికన్నా అధికంగా ఆహారం తీసుకుంటుంటారు కొందరు. ఒకేసారి అలా తీసుకోవడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఒంట్లో చేరుతాయి. పైగా రాత్రి జాగరణ చేయడం వల్ల మరుసటి రోజు భోజనం చేసి, నిద్రపోతారు. తిండి, నిద్ర వల్ల ఒంట్లో అదనపు కొవ్వు పెరుగుతుంది.

ఉపవాసానికి ఇవీ సరైన ఎంపిక...

రోజులో 6 సార్లు ఒక్కోసారి ఒక్కో సలాడ్ కప్పు పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.

పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ. బొప్పాయిలో విటమిన్లు అధికం. అందుకని పుచ్చకాయ, బొప్పాయి సలాడ్ తీసుకోవాలి.

పచ్చికొబ్బరి కోరి సలాడ్‌లో కలిపి తీసుకోవచ్చు. వీటికి కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి యాడ్ చేసుకోవచ్చు.

గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.

ఆరుసార్లు తీసుకుంటే మంచిది. ఆకలి వేస్తున్న ఇదీ ఉండదు. ఆరోగ్యంపై దెబ్బ పడదు.

పాలు ఇష్టపడని వారు పలచటి మజ్జిగ తీసుకోవచ్చు. కండరాలు బలహీనం కాకుండా ఉంటాయి.

జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. పూజలలో పూర్తి శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved