పాములకు కాళ్లుండేవి... 9 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి

పాములకు కాళ్లు ఉండేవా? ఉంటే ఎప్పుడు అంతరించిపోయాయి? పాముల పరిణామ క్రమం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలకోసం అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు ఆధారం దొరికింది. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త హోంగ్యు యి నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. 9 కోట్ల సంవత్సరాలనాటి పాము కపాలాన్ని పరిశోధకులు విశ్లేషించారు. పాములు పుట్టల్లో నివసించడం, వేటాడటం నేర్చుకున్నప్పటి నుంచి వాటి కాళ్లు కోల్పోవడం మొదలైందని తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం ప్రకారం పాములు సముద్రంలో జీవించడానికి అలవాటు పడినప్పటి నుంచి వాటికి కాళ్లు అంతరించిపోయాయని అనుకునేవారు. కానీ అది నిజం కాదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నేటి తరం పాములకు దగ్గరి సంబంధం ఉన్న దినిలిసియా పెటగోనికా అనే పాము లోపలి చెవిని పరీక్షించినపుడు ఈ వివరాలు తెలిశాయి. దొరికిన అవశేషాల త్రీడీ వర్చువల్ మోడల్స్‌ను తయారు చేశారు. ఇప్పటి బల్లులు, పాముల లోపలి చెవుల మాదిరిగానే అవి పనిచేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. చురుగ్గా బొరియలు చేయగలిగే ప్రత్యేక నిర్మాణం అప్పటి పాముల లోపలి చెవుల్లో ఉండేదని గుర్తించారు. ఇటువంటి నిర్మాణం భూమిపైనా, నీటిలోనూ నివసిస్తున్న నేటి తరం పాముల్లో కనిపించడం లేదు. తాజా పరిశోధనల వల్ల పాముల పరిణామ క్రమాన్ని వివరంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. నివసించేందుకు కలుగులు చేయగలిగే అతి పెద్ద పాముగా దినిలిసియా పెటగోనికాను గుర్తించేందుకు అవకాశం కలుగుతుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved