కొడుకా నిను కన్నందుకా మాకీ శిక్ష

తిమ్మాపూర్, కరీంనగర్ కొడుకు ఇంట్లోంచి గెంటేయడంతో ఈ చెట్టూపుట్టా నడుమే ఐదు నెలలుగా బతుకీడుస్తున్న ఈ వృద్ధ దంపతుల పేర్లు కోరెపు రఘుపతిరెడ్డి, అమృతమ్మ. తమ పేరిట ఉన్న రూ.కోటి విలువైన 4.37 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తమకో నీడ కల్పించాలని ఇటీవల కలెక్టర్‌కు వేడుకొని వార్తల్లోకెక్కారు. ఈ సందర్భంగా వారి స్థితిగతులను పరిశీలించేందుకు వెళ్లగా ఇలా తమ గోడు వెల్లబోసుకున్నారు.

ఆ విషయమేంటో రఘుపతిరెడ్డి మాటల్లోనే..

మాది తిమ్మాపూర్ మండలం రేణికుంట. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన కుటుంబం. నాకు మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలోనూ మంచి పేరున్నది. కానీ ఇప్పుడు పుట్టెడు కష్టం వచ్చింది. మాకు ఒక కొడుకు, కూతురు. ఇద్దరిని గారాబంగా పెంచి పెద్ద చేసినం. కూతురి పళ్లై అత్తగారింట్లో ఉంటున్నది. కాటికి కాళ్లు జాపిన వయస్సులో కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన మా పుత్రుడు, ఇద్దరికీ 40 ఏళ్లుగా నరకం చూపిస్తున్నడు. నా భూమిని గుంజుకొని, నెలనెలా భత్యం ఇవ్వకుండా తిప్పలు పెట్టిండు.

ఐదు నెలల క్రితం నిలదీస్తే కరెంట్ షాక్ పెట్టి చంపుతనని బెదిరిచ్చిండు. కొట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టిండు. దెబ్బలకు తాళలేక కట్టుబట్టలతో బయటకువచ్చి పొలం వద్దే ఉంటున్నం. నా కొడుకుకు ఉన్న రాజకీయ పలుకుబడితో బంధువులను, గ్రామస్తులను మా వద్దకు రానిస్త లేదు. పోనీ ఇక్కడే వ్యవసాయం చేసుకొని బతుకుదమని కూలీలను తెస్తే బెదిరించి వెళ్లగొడుతున్నడు.

ఇన్నాళ్లూ మౌనంగా భరించినా ఆకలితో పేగులు మాడుతుంటే తట్టులేకపోతున్నం. చేసేది లేక సోమవారం కలెక్టరమ్మను కలిసినం. రూ.కోటి విలువజేసే నా భూమిని తీసుకొని మమ్ముల చచ్చేదాక పోషించుమని వేడుకున్నం. ఇప్పటికైనా పట్టించుకోకపోతే మాకు చావు తప్ప మరో దారి లేదు. అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved