స్పైసీ.. స్పైసీ.. మంచిదేనట!

రోజువారి ఆహారంలో కారం ఎక్కువగా తినే వారికి క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉందని చైనాలో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. పరిశోధకుల బృందం చైనాలో 4,87,000 మందిపై సర్వే చేసింది. రోజువారీ ఆహారంలో కారం ఎక్కువగా తీసుకోవడం.. త్వరగా మరణించే అవకాశాలపై అధ్యయనం చేశారు. దాదాపు 4,87,375 మంది 30 నుంచి 79ఏళ్ల వయస్సున్న వారిపై ఈ సర్వే చేశారు. వారు ఈ సర్వేలో 2002 నుంచి 2008 మధ్య పేర్లు నమోదు చేసుకున్నారు. దాదాపు ఏడున్నర ఏళ్ల సర్వేలో 20,244 మంది చనిపోయారు. వారంలో ఒకసారి కంటే తక్కువ స్పైసీ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినే వారికి, వారంలో రెండు లేదా మూడు సార్లు స్పైసీ ఆహార పదార్థాలు తినే వారిలో తేడా గమనించారు.

స్పైసీ ఆహారం ఎక్కువ తినే వారిలో పది శాతం త్వరగా చనిపోయే అవకాశం తక్కువగా ఉందని సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. వారంలో నాలుగు, అయిదు, ఆరు సార్లు స్పైసీ ఆహారం తినేవారిలో త్వరగా చనిపోయే రిస్కు 14 శాతం తగ్గినట్లు తెలిపారు. పరిశోధనలో వయసు, వివాహ స్థితి, విద్యాస్థాయి, శారీరక శ్రమ తదితర అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved