కడుపునొప్పికి కచ్చితమైన వైద్యం

అపెండిసైటిస్‌, కిడ్నీలోని రాళ్లు, డయాలసిస్‌, గ్యాస్ట్రి‌క్‌ అల్సర్లు, అండాశయాల వాపు వల్ల విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. దీనికి అత్యవసర చికిత్సలు చేయించాల్సిందే. అయితే సహజంగా కడుపులో చేరిన గ్యాస్‌, మలబద్ధకం, ఎక్కువగా చలిగాలిలో తిరగటం వల్ల చాలా మందికి కడుపునొప్పి వస్తుంటుంది. ఈ కడుపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు కనపడతాయి. రోజులో పలుసార్లు కడుపునొప్పి బాధపెడుతుంటుంది. ఇలాంటి కడుపునొప్పికి సులభ చికిత్సలేంటో తెల్సుకుందాం.

 • ఆహారంలో వెల్లుల్లి, ఇంగువ తరచుగా వాడటం వల్ల కడుపులో గాలి చేరకుండా మలబద్ధకం లేకుండా పోయి కడుపునొప్పి కలగదు.
 • ఆముదం చెట్లు వేళ్లు, శొంఠిని నలగగొట్టి కషాయం కాచి వడబోశాక, ఆ కషాయాన్ని కొద్దిగా నెయ్యిలో వేయించి ఇంగువ చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తాగితే వెంటనే కడుపునొప్పి తగ్గుతుంది.
 • శొంఠిని దోరగా వేయించి మెత్తగా చూర్ణం చేసి దానిలోకి కొద్దిగా సైంధవలవణం కలపాలి. ఈ చూర్ణాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే కడుపునొప్పి, ఉబ్బరం తగ్గుతుంది.
 • కొర్రబియ్యంతో చేసిన పాయసంలో చక్కెర కలిపి తింటే కడుపునొప్పి తగ్గుతుంది.
 • ఉలవలు బాగా ఉడికించి పైన తేరిన నీటిలో మిరియాల చూర్ణం, సైంధవ లవణం కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 • బార్లీ బియ్యంతో చేసిన పాయసంలో తేనె కలిపి తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 • అర టీస్పూన్‌ పాత గోధుమలు చూర్ణంలో తేనె కలిపి తాగాలి.
 • రెండు చెంచాల ములగచెట్టు వేరు రసం తీసి దానిలో మిరియాల చూర్ణం, వంటసోడా, ఉప్పు చిటికెడు చొప్పున తీసుకుని వీటిని సమంగా చేసి కలిపి తాగితే కడుపునొప్పి త్వరగా తగ్గిపోతుంది.
 • ఉదయాన్నే ఒక టీ స్పూన్‌ కరక్కాయల చూర్ణంలో బెల్లం, నెయ్యిని సమంగా కలిపి తింటుంటే కడుపులోని గ్యాస్‌ పోయి మలబద్ధకం తగ్గిపోతుంది.
 • పిప్పిళ్ల చూర్ణం అర టీస్పూన్‌, ఆవునెయ్యి ఒక టీ స్పూన్‌ కలిపి గోరువెచ్చని ఆవుపాలలో తాగితే కడుపునొప్పి తగ్గుతుంది.
 • ఒక చెంచాడు మారేడు పిందెల చూర్ణానికి సమంగా బెల్లం చేర్చి తింటే నొప్పి తగ్గుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.
 • అవిశచెట్టుపట్టతో కషాయం కాచి కప్పు కషాయంలో సైంధవ లవణం, ఇంగువ చేర్చి తాగితుంటే మూడు వారాల్లో కఠినమైన కడుపునొప్పి తగ్గుతుంది.
డాక్టర్‌ కందమూరి  ఆయుర్విజ్ఞానకేంద్రం


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved