మీకో శుభవార్త! 10సంవత్సరాల లోపు ఆడపిల్లలకు

మీకో శుభవార్త! 10సంవత్సరాల లోపు ఆడపిల్లలకు ఆధునికంగా ఎంత ఎదిగినా మన దేశంలో ఇంకా లింగవివక్షత చూపిస్తునే ఉన్నారు. ఆడపిల్ల అని తెలియగానే కొంతమంది భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. మరి కొంతమంది పుట్టగానే అవతల పారేస్తున్నారు. దానికి ముఖ్యకారణం ఆడపిల్ల అంటే.. ఉన్నత చదువులు చదివించినా కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలని వారి అభిప్రాయం. మరి కొంతమంది ఆడపిల్లను జాగ్రత్తగా పెంచి పెద్దచేస్తారు. అయితే వాళ్లకు పెళ్లి చేయడం కోసం అప్పుల పాలవుతుంటారు. అటువంటి తల్లితండ్రులు కూడా మన దేశంలో చాలా మందే ఉన్నారు. ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆడపిల్లల పెళ్లి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండకుండా, ఆడపిల్లల్ని కన్న వాళ్ళకి ఒక ఆర్ధిక భరోసా నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించిన పథకం సుకన్య సంవృద్ది యోజన.

ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే మీ ఇంట్లో 10 సంవత్సరాలలోపు వయసు ఉన్న ఆడపిల్లలు ఉండాలి. ఈ స్కీమ్ లో నెలకు కొంత డబ్బు జమ చేసినట్లైతే… మీ పాప చదువుకో లేదా పెళ్లికో దానికి నాలుగు రెట్ల డబ్బును పొందవచ్చు.

ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి పది సంవత్సరాలలోపు ఎప్పుడైనా ఈ పథకంలో చేరవచ్చని, పోస్టాఫీసుల్లో కానీ, బ్యాంకుల్లో కానీ ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక్క బాలిక పేరిట ఒక్క ఖాతా మాత్రమే అనుమతిస్తారని, ఇద్దరు అమ్మాయిలుంటే ఇద్దరి పేరిట ఖాతా తెరవవచ్చని చెబుతున్నారు. అయితే మినిమమ్ రూ.1000తో ప్రారంభించి ఒక సంవత్సరంలో అత్యధికంగా రూ.1,50,000 పొదుపు చేయవచ్చని అంటున్నారు.

ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 14 సంవత్సరముల వరకు ఇలా పొదుపు చేస్తే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం నగదుగా తీసుకోవచ్చని, 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తం చెల్లిస్తారని చెబుతున్నారు. అలాగే 18 సంవత్సరాల తర్వాత వివాహం చేయాలనుకుంటే మొత్తం సొమ్ము తీసుకోవచ్చని, ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుందని అంటున్నారు. అయితే డీడీ గానీ చెక్కుగానీ జమ చేయాలని, ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం లేదని స్పష్టం చేశారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved