మీకు జలుబు చేసిందా? త్వరగా నయం కావడం లేదా?

జలుబు గురించి రజినీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ వుంది, "ఈ జలుబు వుంది చూశారు, మందు వేసుకుంటే 7 రోజుల్లో తగ్గుతుంది, మందు వేసుకోకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది" అని. మొన్న ఈ మధ్యన ఒక పాశ్చాత్య దేశ ప్రముఖ శాస్త్ర వేత్తల బృందం చేసిన పరిశోధనల మీదట... ఇలానే చెప్పింది. ప్రపంచంలో జలుబుకి, దగ్గుకి వాడే సిరప్ (టానిక్) లు వేటికీ కూడా.... ఆ వ్యాధిని నివారించగల సామర్థ్యం లేదట.

జలుబులో చాలా రకాలు వుంటాయి. తుమ్మలు, ముక్కుదిబ్బడ, ముక్కవెంట నీరు కారడం వగైరా.... మరి ఒక్కోసారి జలుబు చేస్తే కలిగే చిరాకు వర్ణానాతీతం. మరి అలాంటి జలుబు సమస్యనుంచి పరిష్కారం పొందే చిన్న చిన్న సులభమైన ఉపాయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము.

వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని, రాత్రి పూట పడుకునే ముందు త్రాగి నట్లయితే తెల్లారేసరికల్లా జలుబు మటుమాయం కాగలదు. ఉదయాన్నే వేడి వేడి పాలల్లో కాస్తంత మిరియాలను పొడిగా చేసి, అవకాశం వుంటే శొంఠిని సైతం వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగితే జలబునుంచి సత్వర ఉపశమనం కలుగుతుంది. దీనినే ఉత్తర భారతంలో హల్దీ మిల్క్ అంటారు.

కొందరైతే జలుబుతో మరీ ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని... అందులో కాస్తంత పసుపు వేసుకొని... ఆవిరి బయటకు పోకుండా దుప్పటి కప్పుకుని ఆ చెమటలు పట్టె దాకా ఆవిరి పడుతుంటారు. ఇలా చేయడం వలన చెప్పుకోదగిన స్థాయిలో తేడా కనిపిస్తుంది. అదే నీటిలో కాస్తంత అమృతాంజనం వేస్తే మరింత ప్రభావం కనిపిస్తుంది.

తులసి, అల్లపు ముక్కల రసాన్ని తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తూ వుంటే... జలుబు తగ్గుతుంది. శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి కాస్తంత పంచదార కలిపి, వేడివేడిగా తాగితే పడిశం తగ్గుతుంది. ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడిని, చిటికెడు మిరియాల పొడిని ఒక గ్లాసు నీటిలో మరిగించి, వడపోసి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగితే మంచి ఫలితం వుంటుంది. ఒక గ్లాసు వేడి నీటిలో.... ఒక నిమ్మకాయ రసాన్ని పిండి, రెండు చెంచాల తేనెను కలిపి, ప్రతిరోజు పరగడుపున తాగినట్లయితే నిమ్మకాయలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి... తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved