పెరిగిన యూఎస్ వీసా ఫీజు

హెచ్ 1బీ, ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచింది. ఈ పెంపు ప్రభావం ప్రధానంగా భారతీయ ఐటీ కంపెనీలపై పడనుంది. డిసెంబర్ 18, 2015 తరువాత హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా 4 వేల డాలర్లను(రూ. 2.67 లక్షలు) చెల్లించాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. అలాగే, ఎల్1ఏ, ఎల్2బీ దరఖాస్తుదారులు 4500 డాలర్లను(రూ. 3.01 లక్షలు) అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగస్తులుండి, వారిలో కనీసం 50% మంది హెచ్1బీ, లేదా ఎల్1ఏ, ఎల్1బీ నాన్‌ఇమిగ్రంట్ స్టేటస్ వీసాదారులై ఉన్న కంపెనీలకు ఈ పెంపు వర్తిస్తుందని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.

ఈ ఫీజు సాధారణ, ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు, ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఫీజు, అమెరికన్ కాంపిటీటివ్‌నెస్ అండ్ వర్క్‌ఫోర్స్ ఇంప్రూవ్‌మెంట్ యాక్ట్ ఫీజులకు.. తాజాగా పేర్కొన్న ఫీజు అదనమని స్పష్టం చేసింది. ఈ పెంపు సెప్టెంబర్ 30, 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబర్ 18న సంతకం చేయడంతో సంబంధిత చట్టం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కొత్త చట్టంలో పేర్కొన్న సమాచారం ఇవ్వని వీసా పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి తిరస్కరిస్తామని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved