నేను స్నేహహస్తం సొసైటీ సభ్యులతో కలిసి ఒక గర్బవతికి రక్తదానం చేసి హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో , దారిలో ఉన్న ఒక బస్ షెల్టర్ బయట దాదాపుగా 70 సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధుడు,చిరిగిన బట్టలతో చాలా దీనంగా కూర్చొని ఉన్నాడు. మేము అతని దగ్గరికి వెళ్ళి విషయమేమిటని అడుగగా, ” అయ్యా...! నాకు ఇద్దరు కొడుకులు,ఒక కూతురు ఉంది. నా కూతురు పండుగకు ఇంటికి వచ్చిందని ,ఆమెకు ఒక చీర,ఆమె బిడ్డకు ఒక గౌను కొనిచ్చాను.ఈ విషయం తెలిసిన నా ఇద్దరు కొడుకులు, “నీకు తిండి పెట్టడమే దండగ,అలాంటిది నువ్వు మళ్ళీ ఇలా చీరెలు,సారెలు అని మమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నావా” అంటూ,నానా రకాలుగా తిడుతూ ,నన్ను మెడ పట్టి బయటకు గెంటి వేస్తూ,మళ్ళీ ఇంట్లోకి వస్తే కాళ్ళూ చేతులు విరగ్గొడతామన్నారయ్యా” అంటూ ఏడుస్తూ చెప్పాడు. “ మీ వాళ్ళతో మేము మాట్లాడుతాం, మీ ఇంటి వద్దకు వెళదాం పద....” అని ఆ వృద్దునితో అంటే, వెంటనే అతను రెండు చేతులూ జోడించి మొక్కుతూ, “ నేను చావనైనా చస్తానుగానీ, వాళ్ళ ముఖాలు చూడను, ఆ ఇంటికి వెళ్ళను “ అంటూ ఏడుస్తూ చెప్పాడు. అతని దీనావస్థను చూసి , అతనికి ధైర్యం చెప్పి, ఆకలితో ఉన్న అతనికి ఆహారాన్ని ఇచ్చి, వస్త్రాలను అందించి,మేము వృద్ధాశ్రమంలో చేర్పించి అతనికి అన్ని ఏర్పాట్లు చేయించాము. ఐదు సంవత్సరాలు అయినా కూడా అతని ఇద్దరు కొడుకులు కనీసం పలకరించడానికి కూడా రాలేదు. ఏ కూతురి కోసమైతే అతను ఇంటిలో నుండి అవమానాలతో గెంటివేయబడ్డాడో, చివరకు ఆమె కూడా చూడటానికి రావటం లేదు. ఈ సంఘటన 5 సంవత్సరాల క్రితం అనగా 2010 వ సంవత్సరం మార్చి 15 వ తేదీన జరిగింది. ఆనాటి ఈ సంఘటన నుండి ఇలాంటి బాధలు పడుతున్న వృద్ధులు ఇంకా ఎందరో ఈ సమాజంలో ఉన్నారని భావించి, స్నేహహస్తం సొసైటీ లో అనాధ వృద్ధుల కోసం “ వార్ధక్య సేవ” అనే ప్రత్యేక విభాగం ద్వారా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తున్నాము. - గోపిరెడ్డి జగదీశ్వరరెడ్డి

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved