ఈయన గురించి తెలుసుకోకపోతే ముంబై బాధ పడుతుంది

‘సారీ ఇట్స్‌ టూ లేట్‌, ఒక్క అరగంట ముందు తీసుకొచ్చుంటే ఏదైనా చేయగలిగేవాళ్ళం’. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ చాలామందికి ఎదురయ్యే డైలాగే ఇది. అదీ అర్ధరాత్రి ఏదయినా అనారోగ్య సమస్య తలెత్తితే ఇక అంతే సంగతులు! అంబులెన్సులు సమయానికి రావు. ఆటోలు దొరకవు. ఒకవేళ ఏదైనా టాక్సీ, ఆటో దొరికినా వాళ్ళు అడిగినంతా ఇవ్వాల్సిందే! ఇదే విషయం విజయ్‌ని తీవ్రంగా కలచివేసింది. అర్ధరాత్రి ఆరోగ్యం చెడి హాస్పిటల్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక్క ఫోన్ కొడితే చాలు వాళ్ళ ముంగిట్లో తన టాక్సీతో రెడీ అయిపోతాడు. అదీ ఎటువంటి చార్జ్‌ చేయకుండా!

ముంబైకి చెందిన విజయ్‌ ఠాకూర్‌ ఎల్‌ అండ్‌ టీ సంస్థలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. ఓసారి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అర్ధరాత్రివేళ ఆమెకు నొప్పి మొదలైంది. అరగంట ఎదురుచూసినా ఒక్క ఆటో రాలేదు. చివరికి రెట్టింపు డబ్బులిస్తే వస్తానంటూ ఓ టాక్సీ డ్రైవర్‌ ముందుకొచ్చాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. అబార్షన్ చేసి పిండాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ సంఘటనతో కలతచెందాడు విజయ్‌. అలాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా తన వంతుగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే. చేస్తున్న ఉద్యోగానికి వెంటనే రాజీనామా చేసి, ఓ టాక్సీ కొన్నాడు. రోగులకు పూర్తిగా ఉచితం అని ప్రచారం చేశాడు. ట్యాక్సీ స్టాండ్స్‌లో, వీధుల్లో తన ఫోన్ నంబర్‌ను పాంప్లెట్లుగా పంచి, అవసరమైన వాళ్ళు ఏ సమయంలో ఫోన్ చేసినా క్షణాల్లో వస్తానని హామీ ఇచ్చాడు. దాదాపు 30 ఏళ్ళ నుంచీ ఇదే పనిలో ఉన్నాడు విజయ్‌. అలా ఇప్పటి వరకూ 500 ప్రాణాలు నిలబెట్టాడు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు, అంబులెన్స్‌ల కంటే ముందుగా విజయ్‌కే ఫోన్లు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోపక్క సిగ్నల్‌ జంప్‌ చేశాడనీ, అతి వేగంగా వెళ్తున్నాడనీ పోలీసులు వెంబడించి చివరికి కార్లో రోగుల్ని చూసి అతడిని వదిలిపెట్టిన సంఘటనలకూ లెక్కలేదు.

ప్రస్తుతం విజయ్‌కి 62 ఏళ్ళు. బీపీ, షుగరూ ఉన్నాయి. ఇన్నాళ్ళూ చేసింది చాలు, ఇప్పటికైనా ఇంటిదగ్గర ఉండమని కుటుంబ సభ్యులు కోరుతూనే ఉంటారు. కానీ అతడు వింటేగా! తన పని తాను చేసుకుపోతూనే ఉన్నాడు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా ప్రజాసేవకే కంకణం కట్టుకున్న అతడి నిస్వార్ధ సేవకు హ్యాట్సాఫ్‌ చెబుదామా!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved