బరువు తగ్గడానికీ....

సూప్ తాగడం తప్పనిసరి..!

బరువు తగ్గాలని అనుకున్నప్పుడు ఒకపూట భోజనం మానేయడం లేదా విపరీతంగా వ్యాయామం చేయడం... రెండూ పొరపాటే. బరువు తగ్గడానికీ కొన్ని నియమాలుంటాయి.

సన్నబడాలి అనుకునే వారిలో పదిశాతం మంది పొద్దుటిపూట టిఫిన్‌ని మానేస్తారట. కానీ దీనివల్ల శరీరం చురుగ్గా ఉండకపోగా, మధ్యాహ్నం అవసరానికి మించి తీసుకునే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే పొద్దుటిపూట తినే టిఫిన్‌ని అసలు మానకూడదు.

తృణధాన్యాలూ, తేనె, బాదం, పెరుగు లాంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అయితే కెలొరీల మోతాదు తగ్గాలంటే ఉడికించిన పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కొవ్వు పదార్థాలు పూర్తిగా మానేయాలని లేదు కానీ.. సరైన వాటిని ఎంచుకోవాలి. అంటే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుండే ఆలివ్‌నూనె, వాల్‌నట్ల వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లూ, కూరగాయలూ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి పీచు అందుతుంది. ఇది అధిక కొవ్వుని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. దాంతోపాటూ విటమిన్లూ, ఖనిజాలూ శరీరానికి అందుతాయి.

• నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటుగా మార్చుకోవాలి. తరచూ నీళ్లు తాగడం ఇబ్బంది అనుకునేవారు చక్కెర తక్కువగా వేసిన నిమ్మనీటిని తీసుకోవచ్చు. బదులుగా శీతలపానీయాలు పూర్తిగా మానేయాలి. సన్నగా మారేందుకు వేళకు నిద్రపోవడం కూడా అవసరమే కాబట్టి ఎన్ని పనులున్నా కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.

• భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల ఇరవైశాతం కెలొరీలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సూప్ తాగడం రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి. అలాగే కొవ్వు తగ్గడానికి ప్రొటీన్లున్న ఆహారం కూడా ఎంతో మేలుచేస్తుంది కాబట్టి వాటి మోతాదును పెంచి, పిండిపదార్థాలను తగ్గించాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved