ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేయకుండా సంవత్సరంలో 34కిలోలు తగ్గాడు!

ప్రస్తుత కాలంలో చాలామందిని తీవ్రంగా వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ బిజీలైఫ్‌లో సమయానికి భోజనం చేయక, తిన్నా అతిగా భుజిస్తూ ఇలా ఏదో ఒక కారణంతో విపరీతంగా బరువు పెరుగుతున్నారు. దీంతో పట్టుమని 25ఏళ్లు నిండకముందే పొట్టలతో పార్కుల వెంట పరుగులు తీస్తున్నారు. కోడి కూయక ముందే ఎక్సర్‌సైజ్‌లంటూ ఆపసోపాలు పడుతున్నారు. బరువు తగ్గడానికి ఎన్నో పరిష్కార మార్గాలున్నా అందరి విషయంలో అవి సత్ఫలితాలనిస్తాయని చెప్పలేం. వారి శరీర తీరుపై బరువు తగ్గడం, పెరగడం అనే అంశాలు ఆధారపడి ఉంటాయి.

కానీ తగ్గేందుకు ప్రయత్నమైతే చేయాల్సిందేగా. అలా ప్రయత్నం చేసి సత్ఫలితాలను పొందిన వ్యక్తే మలేషియాకు చెందిన శశికుమార్ విజయన్. ఇతను ఒకప్పుడు తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతుండేవాడు. ఎంతలా అంటే ఏ పని మీద ఏకాగ్రత ఉండేది కాదు. బరువు విపరీతంగా పెరిగానని తనలో తాను కుమిలిపోతుండేవాడు. తన గురించి చెప్పుకొస్తూ 12 సంవత్సరాల వయసు నుంచి ఎక్కువగా తినేవాడినని, కాలేజీలో చేరే సమయానికి అత్యంత దారుణంగా తయారయ్యానని చెప్పాడు.

ఇక ఏదో ఒకటి చేయకపోతే తను జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సొస్తుందని భావించానని శశికుమార్ చెప్పాడు. ఆ సమయంలోనే ఎక్సర్‌సైజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 94కిలోల బరువుతో బాధపడుతున్న తను కొన్ని రోజులు వ్యాయామం చేశానని చెప్పాడు. కొన్ని రోజులకు మార్పు కనిపించిందని, కానీ ఆ మార్పు శాశ్వతంగా కనిపించాలంటే ఎక్సర్‌సైజ్ మార్గం కాదని తెలుసుకున్నానని శశి చెప్పాడు. అప్పుడే ఆహారంపై కొన్ని నియమాలు పెట్టుకున్నట్లు చెప్పాడు. తనకు డైటీషియన్, ఫిట్‌నెస్ ట్రైనర్ ఎవరూ లేరని... ఈ విషయంలో గూగులే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు.

అన్నం తినడం మానేశానని, దానికి బదులుగా ఉడకబెట్టిన ఆహారం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకున్నానని శశికుమార్ చెప్పుకొచ్చాడు. రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగేవాడినని, సోడా డ్రింక్స్ తాగడం మానేశానని చెప్పాడు. క్రమేపి బరువు తగ్గానని, ఈ ఒక్క విధానం అనుసరించడం వల్ల సంవత్సరంలోనే 34కిలోలు తగ్గానని తెలిపాడు. బరువు తగ్గడానికి చాలామంది తినడం మానేసి ఆకలితో కడుపు మాడ్చుకుంటారని, అది సరైన పద్ధతి కాదని చెప్పాడు. బరువు తగ్గడం కోసం చేసే శారీరక శ్రమ వల్ల ఆకలేస్తుందని, ఆ సమయంలో మితంగా తినాలని తెలిపాడు. ఇలా చేయడం వల్ల 2015లో 94కిలోలున్న తను, 2016 నవంబర్ నాటికి 64 కిలోలకు తగ్గానని చెప్పుకొచ్చాడు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved