గుంజీలు తీయకపోతే వినాయకుడు అనుగ్రహించడా ?

వినాయకుడి ముందు గుంజీలు తీసే ఆచారం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?

వినాయకుడు అంటేనే వింత, విచిత్రం. ఆకారంతో పాటు ఆయన ఇష్టపడేవి కూడా కొంత ఆశ్చర్యకరంగానే ఉంటాయి. అటుకులు, బెల్లం, చెరకు, కుడుములు, ఉండ్రాళ్లు ఇలా బొజ్జగణపయ్య ఇష్టపడే నైవేద్యాలు. వీటితోపాటు గుంజీలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. వినాయక చవితి రోజు కంపల్సరీ గణపయ్య ముందు గుంజీలు తీస్తాం. అలాగే ఆలయాల్లో వినాయకుడి ముందు కూడా గుంజీలు తీస్తూ ఉంటాం. అసలు గుంజీలకు, వినాయకుడికి సంబంధం ఏంటి ? వినాయకుడి ముందే ఎందుకు గుంజీలు తీస్తాం ? గుంజీలు తీయకపోతే వినాయకుడు మన మొర ఆలకించడా ?

వినాయకుడి ముందు గుంజీలు తీసే ఆచారం వెనక పురాణ కథ ఉంది. శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి బహుమతులు తీసుకోచ్చేవారట. అలా బహుమతులు అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మింగేశాడు. కాసేపటికి మహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే నేను మింగేశానని చెప్పారట బొజ్జ గణపయ్య. ఎంత ప్రార్థించినా.. ప్రాధేయపడినా ఇవ్వలేదు. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అది చూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. అలా నవ్వుతున్నప్పుడు సుదర్శన చక్రం బయటపడింది. అప్పటి నుంచి కోరిక కోర్కెలు నెరవరడానికి, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీయడం ఆచారంగా మారింది.

అయితే గుంజీలు తీయడం వెనక మరో అంతరార్థం కూడా ఉంది. గుంజీలు తీస్తే వినాయకుడికి సంతోషం కలుగుతుంది. కాబట్టి కోరికలను త్వరగా తీరుస్తారని ఒక నమ్మకం ఉంది. అయితే సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని మరో నమ్మకం ఉంది. గుంజీలు తీయడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. ఇది మెదడుకు యోగా అని సైంటిస్ట్స్ చెబుతున్నారు. అలాగే దీని వల్ల బరువు తగ్గడంతో పాటు, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయట.

ఇక పిల్లలను కంపల్సరీ గుంజీలు తీయమని చెబుతుంటారు. ఎందుకంటే.. ఈ సూపర్ బ్రెయిన్ యోగా ద్వారా పిల్లల్లో మానసిక పెరుగుదల బాగుండి, చదువులో ముందుంటారని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. అలాగే స్కూల్లో చదువులో వెనకబడిన వాళ్లకు కూడా గుంజీలనే ఎక్కువగా పనిష్మెంట్ ఇస్తారు. దీనికి కారణం ఇదే. గుంజీల ద్వారా బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుందట.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved