ప్రేమించలేదని యువతి గొంతు కోశాడు

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం బండ్లగూడెంలో ఘోరం జరిగింది. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ ప్రేమోన్మాది బ్లేడుతో యువతి గొంతుకోశాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బండ్లగూడెంకు చెందిన అనిత ఎంబీఏ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో ఉద్యోగం చేస్తోంది. రాజ్‌కుమార్ అనే యువకుడు అదే కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా రాజ్‌కుమార్ ప్రేమ పేరుతో అనిత వెంట పడుతూ పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. అనిత అతని వేధింపులు తట్టుకోలేక వేసవి సెలవుల్లో సొంతూరుకు వెళ్లింది. శనివారం రాజ్‌కుమార్ నలుగురు స్నేహితులతో కలసి బండ్లగూడకు వెళ్లాడు. అనితకు ఫోన్ చేసి పిలిపించి ప్రేమ విషయం మాట్లాడాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఊర్లో అందరూ చూస్తుండగానే రాజ్‌కుమార్ బ్లేడుతో అనిత గొంతు, చేతిని కోసి తీవ్రంగా గాయపరిచాడు. అనిత కేకలు వేయడంతో గ్రామస్తులు రాజ్‌కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా అతని స్నేహితులు బైకులపై పరారయ్యారు. అనితను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved